అతిథులకు షర్మిల క్షమాపణలు.. ఎందుకంటే?
X
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా తన కుమారుడి ఎంగేజ్ మెంట్ కు వచ్చిన అతిథులకు షర్మిల కృతఙ్ఞతలు తెలిపారు. పిలవగానే వచ్చి తన కుమారుడు, కోడలును ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్నేహితులు, బంధువులు అనుకున్నదాని కంటే ఎక్కువ సంఖ్యలో విచ్చేయడంతో చిన్నపాటి అసౌకర్యం కలిగిందని, అందుకు తాను చింతిస్తున్నానని అన్నారు. ఈ విషయంలో తనను క్షమించాలని, పెళ్లి సమయంలో అలా జరగకుండా చూసుకుంటానని షర్మిల స్ఫష్టం చేశారు.
కాగా ఫిబ్రవరి 17న రాజారెడ్డి -అట్లూరి ప్రియ వివాహం జరగనుంది. తన కుమారిడి వివాహానికి షర్మిల పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేల, కేసీ వేణుగోపాల్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తదితరులను ఆహ్వానించారు.