వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ పదవికి కీలక నేత రాజీనామా
X
వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను ఆయన వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పే అవకాశం కూడా సీఎం జగన్ తనలాంటి నేతలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేడర్ సలహాలు తీసుకోకుండానే సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అరాచక పాలనలో తాను భాగస్వామ్యుడిని కాకూడదనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశానని, తనకు ఆ పార్టీ ఇచ్చిన పదవిని కూడా ఉంచుకోదలచుకోలేదని చెప్పారు. మూడేళ్లు ఇంకా ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ తాను రాజీనామా చేశానని, తాను రెండేళ్ల నుంచి పార్టీలో అసంతృప్తితోనే ఉన్నానని, కానీ ఇన్ని రోజులు ఓపిక పట్టానని అన్నారు. రూ.12 లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందన్నారు. అప్పులు చేసి ప్రజల భవిష్యత్ తో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం తమ లాంటి పెద్దల సలహాలను కూడా తీసుకునే పరిస్థితి లేదన్నారు. తాను రాజీ ఎక్కడా ఉండలేనని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ విలువలను తాను కాపాడేందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. జగన్ కూడా తనను కలిసే అవకాశం ఏనాడూ ఇవ్వలేదన్నారు.