కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్లలోపు వాళ్లను చేర్చుకోవద్దు.. కేంద్రం
X
పోటీ పరీక్షల కోసం అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే సెంటర్లకు కేంద్ర విద్యా శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్న వయస్సులో విద్యార్థులను కోచింగ్ కు పంపడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడం, అధిక ఫీజులను కట్టడి చేయడంతో పాటు కోచింగ్ సెంటర్లలో మౌళిక వసతుల కల్పించేందుకు కేంద్ర ఈ కొత్త రూల్స్ ను రూపొందించింది.
కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే..
.. సెకండరీ పాఠశాల విద్య (10వ తరగతి) పూర్తి చేసిన వారికి మాత్రమే కోచింగ్ కోసం పేరు నమోదు చేసుకునేందుకు అనుమతించాలి. 16 ఏళ్లలోపు వాళ్లను చేర్చుకోకూడదు.
.. శిక్షణ కేంద్రాల్లో అర్హులైన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పదోవ పట్టించేలా ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
.. సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజ్ రీఫండ్ సంబంధించిన సమాచారం వెబ్ సైట్ లో పొందుపరచాలి.
.. కోచింగ్ సెంటర్లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.
.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు చాలినంత స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.
.. శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది. ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్ లను రిజిస్ట్రేషన్ చేయాలి.
.. కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలి.