పోటీ పరీక్షల్లో కాపీ కొడితే ఇక అంతే సంగతులు.. కొత్తం చట్టంతేనున్న కేంద్రం
X
పోటీ పరీక్షల్లో అవకతవకలను నిరోధించేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ బిల్లును ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద నేరం నిరూపణ అయితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించనుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే ముఠాలు, వారికి సహకరించే ప్రభుత్వ అధికారులను కూడా ఈ చట్టం ద్వారా శిక్షించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోటీ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించేందుకు కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ లో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. నిజాయితీతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని యువతకు భరోసా ఇవ్వడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని అన్నారు. కాగా జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు.