సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్
X
సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ న్యాయంస్థానం ఆమెకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఆమె బేఖాతర్ చేయడంతో జయప్రదపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనవరి 10వ తారీఖులోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రామ్ పూర్ పోలీసులు బృందాలుగా విడిపోయి జయప్రద కోసం వెతుకున్నారు. కాగా నటి జయప్రద ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు హిందీ ఇతర ఉత్తరాది భాషా చిత్రాల్లో కూడా ఆమె నటించి మెప్పించారు. అనంతరం టీడీపీతో తన రాజకీయ జీవితం మొదలుపెట్టిన జయప్రద.. తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే ఇటీవలే ఆమె ఎస్పీని వీడి బీజేపీలో చేరారు.