రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ముస్లింకు తొలి ఆహ్వానం.. ఎందుకంటే..?
X
ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ్ మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ మందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా శ్రీ రామ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ తొలిసారిగా ఓ ముస్లిం వ్యక్తికి ఆహ్వానం పంపింది. అయోధ్యకు చెందిన ఇక్బాల్ అన్సారీని రామ్ మందిర ప్రారంభోత్సవానికి రావాలని కోరింది. ఓ హిందూ కార్యక్రమానికి ముస్లింను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే దేవుడికి హిందూ ముస్లిం అనే తేడా ఏమీలేదని రామాలయ ట్రస్ట్ పేర్కొంది.
ఇంతకీ ఇక్బాల్ ఎవరంటే?
రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ అనే ముస్లిం న్యాయవాది బాబ్రీ మసీదుకు మద్దతుగా వ్యవహరించారు. అంతకు ముందు ఆయన తండ్రి హషీమ్ అన్సారీ ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు. అయితే 2016లో హషీమ్ మృతి చెందడంతో ఈ కేసును ఇక్బాల్ అన్సారీ కోర్టుకు తీసుకెళ్లారు. ఇక ఈ కేసును వాదించిన ఇక్బాల్ ఎక్కడా కూడా అయోధ్య రామమందిరానికి వ్యతిరేకంగా వాదించలేదు. కానీ బాబ్రీ మసీదు విషయంలో కూడా న్యాయం జరగాలని వాదించారు. ఇక గత నెల 30న మోడీ అయోధ్యలో పర్యటించగా ఇక్బాల్ అన్సారీ ఆయనను పూలవర్షంతో ఘనంగా స్వాగతించారు. దేశ ప్రధానికి తాను స్వాగతం పలికానని, అందులో తప్పేముంది అని ఇక్బాల్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయనకు రామమందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం అందింది.