అది మామూలు ఎద్దు కాదు.. ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్
X
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉంటారో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారాయన. దేశంలో కొత్త కొత్త టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇప్పటికి ఎంతో మంది ప్రతిభావంతులను ఆయన ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే తాజాగా ఆయన ఓ టాలెంటెడ్ ఎద్దుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. జీవితంలో పాజిటివ్ గా ఎలా ఉండాలి అనే సత్యాన్ని ఈ ఎద్దు నుంచి నేర్చుకోవచ్చని కామెంట్ చేశారు. "ఆ ఎద్దుకే గనుక మాటలు వస్తే దానిని మించిన మోటివేషనల్ స్పీకర్ ఈ ప్రపంచంలోనే ఉండరు" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక 'రాము' అనే ఆ ఎద్దు మామూలు ఎద్దు కాదు. పంజాబ్ రాష్ట్రం లూధియానాలోని ఆశారామ్ ఆశ్రమంలోని ఈ రాము అనే ఎద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు ఎవరి సాయం లేకుండా తనే చేస్తుంది. యజమాని సహకారం అవసరం లేకుండా ఎడ్ల బండిని తానే సొంతంగా లాగుతుంది.
గ్రామంలోని పలు షాపులకు స్వయంగా వెళ్లి బస్తాలను బండిలో తీసుకొని గమ్యస్థానాలకు ఎవరి సాయం లేకుండానే వెళ్తుంది. అలాగే పేడ, మట్టి వంటి వాటిని స్థానికులు బండిలో వేస్తే తానే స్వయంగా వాటిని గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ఇక తనకు దురద పెడితే అన్ని జంతువుల లాగా తోకతో కాకుండా తన కొట్టంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కర్రకు తన శరీరాన్ని రుద్దుతూ ఉపశమనం పొందుతూ ఉంటుంది. డ్రైవర్ లేకుండా ఏ వాహనాన్ని నడపడం కుదరని ఈ రోజుల్లో తనకు మార్గాన్ని చూపెట్టడానికి ఎవరూ లేకున్నా ఈ ఎద్దు అనుకున్న ప్రదేశానికి వెళ్లడం చూసినా ప్రతి ఒక్కరూ " ఔరా! ఇది మామూలు ఎద్దు కాదు" అని ఆశ్చర్యపోతున్నారు. అందుకే దీని టాలెంట్ ఆనంద్ మహీంద్రా దాకా వెళ్లిందని ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.