మా వల్లే ఆయనకు 'భారతరత్న' వచ్చింది.. Bihar CM Nitish
X
తమ పోరాటం వల్లే కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న అవార్డు వచ్చిందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్(మరణానంతరం) కు నిన్న రాత్రి కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ కర్పూరీ ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా పాట్నాలో జేడీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న రావడాన్ని ప్రధాని మోడీ తన ఖాతాలో వేసుకుంటున్నారని, కానీ అది కరెక్ట్ కాదని అన్నారు. కర్పూరీ ఠాకూర్ బీహార్ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడే కర్పూరీ ఠాకూర్ బీహార్ లో మధ్యపాన నిషేధం అమలు చేశారని నితీశ్ అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన ఎన్నో సంస్కరణలు అమలు చేశారని అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని తాము ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశామని అన్నారు.
2007 నుంచి 2023 వరకు కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలను తాము డిమాండ్ చేస్తూ వచ్చామని అన్నారు. కానీ వాళ్లు తమ డిమాండ్ ను పట్టించుకోలేదని అన్నారు. భారతరత్న అవార్డు ప్రకటించాక కర్పూరీ ఠాకూర్ కుమారుడు, తమ పార్టీ సభ్యుడైన రామ్ నాథ్ థాకూర్ కు ప్రధాని మోడీ చేసి శుభాకాంక్షలు చెప్పారని, కానీ సీఎంగా ఉన్న తనకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని అన్నారు. ఏదిఏమైనా కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న అవార్డు ప్రకటించినందుకు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు అని నితీశ్ అన్నారు.