Home > జాతీయం > పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే?

పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే?

పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే?
X

మహారాష్ట్ర-ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్ లో శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్‌ తుపాకితో కాల్పులు జరిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్ గైక్వాడ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కల్యాణ్ ఈస్ట్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కి శివసేన (షిండే వర్గం) నేత, సీఎం షిండేకు సన్నిహితుడైన మహేశ్ గైక్వాడ్ కు మధ్య ఓ ల్యాండ్ విషయంలో తగాదా ఉంది. ఈ నేపథ్యంలోనే చర్చల కోసమని వారిద్దరూ శుక్రవారం రాత్రి ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే వారిద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవగా మారింది. దీంతో ఆగ్రహం చెందిన బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్‌ శివసేన నేత మహేశ్ గైక్వాడ్ పై కాల్పులు ప్రారంభించారు. దీంతో మహేశ్ గైక్వాడ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి కిందపడ్డారు. అయితే ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్‌ అతడికి సమీపంగా వెళ్లి రివాల్వర్ తో కాల్పులు జరిపారు. అయితే పక్క రూమ్ లో ఉన్న పోలీసులు లోపలికి వచ్చి ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ మహేశ్ గైక్వాడ్ ను ఆసుపత్రికి తరలించారు.

కాగా తన ముందే తన కొడుకుపై మహేశ్ గైక్వాడ్ దాడి చేశాడని, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ తెలిపారు. అతడిని కాల్చినందుకు తాను ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదని ఎమ్మెల్యే అన్నారు. ఇక మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేపై కూడా గణపత్ గైక్వాడ్‌ విమర్శలు గుప్పించారు. షిండే పాలనలో రాష్ట్రంలో నేరస్థులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. తనలాంటి మంచి వ్యక్తిని కూడా చివరికి క్రిమినల్ గా మార్చిన వ్యక్తి షిండే అని ఫైర్ అయ్యారు. ఉద్ధవ్ థాక్రను మోసం చేసినట్లుగానే బీజేపీని కూడా షిండే మోసం చేస్తారని ఆరోపించారు. మహారాష్ట్ర బాగుండాలంటే షిండే తక్షణమే రాజీనామా చేయాలని, ఈ విషయంలో ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చొరవ తీసుకోవాలని కోరారు. కాగా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజా ఘటనతో మరి ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.

Updated : 3 Feb 2024 11:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top