Etala Rajender : కర్పూరి ఠాగూర్ బీసీలకు చేసిన సేవలు మరువలేనివి... ఈటల రాజేందర్
X
భారతరత్న కర్పూరి ఠాగూర్ బీసీలకు చేసిన సేవలు మరువలేనివని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కర్రూరి ఠాగూర్ గౌరవార్థం ముద్రించిన క్యాలెండర్ ను ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ నాయి బ్రహ్మణ కులంలో పుట్టిన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్ బీసీలు, ఎంబీసీలకు ఎనలేని సేవ చేశారని అన్నారు. భారతదేశంలో బీసీలు, ఎంబీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో కర్పూరి ఠాగూర్ ముఖ్య భూమిక పోషించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసిన ముంగేరి లాల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని కర్పూరి ఠాగూర్ ప్రయత్నించి తన సీఎం పోస్టును కూడా త్యాగం చేశారని అన్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖులు రిజర్వేషన్లను అమలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. దీంతో ఇప్పటికీ బీసీలు రాజకీయంగా తీవ్ర వివక్షతకు గురవుతున్నారని అన్నారు.
దేశంలో, రాష్ట్రంలో బీసీల ఐక్కతకు ప్రాధాన్యం కల్పించాలని , కర్పూరి ఠాగూర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇక కర్పూరి ఠాగూరుకు భారతరత్నఇవ్వడం పట్ల ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు , బీసీ సమాజ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పిసతీష్ సాగర్ , జాతీయ ఎంబీసీ నాయకుడు వెంకటేష్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఏం. శ్రీనివాస్ సాగర్, బీసీ జర్నలిస్టుల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.