సామాన్యులకు అందుబాటు ధరలో భారత్ బ్రాండ్ రైస్..!
X
నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. ఇక బియ్యం ధరలు ఏకంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. బియ్యం రకాన్ని బట్టి కిలో బియ్యానికి రూ.50 నుంచి 70 వరకు రిటైల్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెరిగిన బియ్యం ధరలను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులకు 'భారత్' బ్రాండ్ గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'భారత్' బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో శనగపప్పును కిలో రూ.60, కిలో గోధమ పిండి రూ.27.50కే 'భారత్' బ్రాండ్ అందిస్తోంది. నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFeD) ద్వారా దేశంలోని 2వేల రిటైల్ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'భారత్' బ్రాండ్ ద్వారా సామాన్యులకు రూ.25కే కిలో బియ్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.