అయోధ్యలో భూమి కొన్న అమితాబ్
X
ఈ నెల 22న అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా రామ మందిరం నిర్మాణంతో అయోధ్యలో రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడింది. శ్రీ రాముడు నడయాడిన ప్రాంతంలో భూమి కొనుగోలు చేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఓ ప్లాట్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఆయన పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టులో బిగ్ బీ ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది.
ముంబైకి చెందిన డెవలపర్ ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఏబీఎల్)’ అయోధ్యలో సరయూ పేరుతో 51 ఎకరాలలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. 2028 నాటికల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది. తమ ప్రాజెక్టులో మొదటి ప్లాట్ ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఇక బిగ్ బీ అమితాబ్ అయోధ్యలో ప్లాట్ కొన్నారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో అక్కడ ప్లాట్లు కొనడానికి మరింత మంది సెలబ్రిటీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్య రాముడికి అత్యంత సమీపంలో ప్లాట్ కొనుగోలు చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.