త్వరలోనే కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. Nitish Kumar
X
త్వరలోనే బీహార్ లో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రకటించారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించిన అనంతరం నితీశ్ మీడియాతో మాట్లాడారు. మహాఘట్ బంధన్ కు గుడ్ బై చెప్పానని, త్వరలోనే కొత్త కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కూటమిలో ఏ ఏ పార్టీలు ఉంటాయనేది త్వరలోనే చెబుతామని అన్నారు. కాగా బీహార్‌లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య నితీశ్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి ఇవాళ రాజీనామా చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత నితీశ్ కుమార్ రాజీనామా లేఖను సమర్పించేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్డీయే మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. జేడీయూ శాసనసభా పక్ష సమావేశంలో నితీశ్ కుమార్ బీజేపీ సీనియర్ నేతతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈరోజు సాయంత్రం తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజే నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ లోక్‌సభ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్ కుమార్‌ను తనవైపు తిప్పుకుంది బీజేపీ. దీంతో బీహార్‌లోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. ఇక బీహార్ తాజా రాజకీయం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన నాయకుడిగా ఉన్న నితీశ్ కుమార్ ఇలా సడెన్ గా ప్లేట్ ఫిరాయించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే నితీశ్ కుమార్ బీజేపీతో కలవడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.