Jwala : మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా
X
భారత్ లో చీతాల సంతతిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకువచ్చింది. వాటిని అటవీ అధికారులు మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. కాగా నమీబియా నుంచి తెచ్చిన 'జ్వాల' అనే చీతా తాజాగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వన్యప్రాణి సంరక్షకులకు, వన్యప్రాణి ప్రేమికులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత్ వన్యప్రాణి సంతతి వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 'జ్వాల' అనే చీతా, దాని పిల్లల వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. ఇటీవలే ఆశ అనే చీతా రెండు పిల్లలు పెట్టగా, ఇప్పుడు 'జ్వాల' మూడు కూనలకు జన్మనివ్వడంతో కునో నేషనల్ పార్క్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా విదేశాల నుంచి ఆ చీతాల్లో దురదృష్టవశాత్తు 10 చీతాలు మరణించాయి. అనారోగ్య కారణాలతో అవి మృత్యువాత పడినట్టు అటవీ అధికారులు తెలిపారు. ఇక భారతదేశంలో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు.