8 ఏళ్ల కిందట ఐఏఎఫ్ విమానం అదృశ్యం.. తాజాగా శకలాలు గుర్తింపు
X
దాదాపు 8 ఏళ్ల కిందట 29 మందితో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. అయితే ఆ విమానం శకలాలను తాజాగా గుర్తించారు. 2016 జూలై 22న ఉదయం 8 గంటలకు ఐఏఎఫ్కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-32 రవాణా విమానం కే-2743 చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయ్యింది. సిబ్బందితో సహా 29 మందితో వారాంతపు పర్యటన కోసం అండమాన్, నికోబార్ దీవులకు బయలుదేరింది. పోర్ట్ బ్లెయిర్లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ ఉత్క్రోష్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ బంగాళాఖాతం సముద్రం మీదుగా వెళ్తున్న ఐఏఎఫ్ విమానం కొంత సేపటికి అదృశ్యమైంది. రాడార్తో సంబంధాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ విమానం కోసం సైనిక దళాలు మూడు నెలలపాటు విస్తృతంగా బంగాళాఖాతంలో సెర్చ్ చేశాయి. ఫలితం లేకపోవడంతో ఆ విమానంలోని 29 మంది మరణించి ఉంటారని ఐఏఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఆయా కుటుంబాలకు అదే ఏడాది సెప్టెంబర్ లో లేఖలు పంపింది. అయితే తాజాగా చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. వాటి ఫొటోలను పరిశీలించిన తర్వాత ఐఏఎఫ్కు చెందిన ఏఎన్-32 విమానానికి చెందిన శకలాలుగా నిర్ధారించారు. బంగాళాఖాతంలోని ఆ ప్రాంతంలో ఏ విమానం కూలిన సంఘటనలు లేకపోవడంతో ఐఏఎఫ్ కే-2743 విమానం శకలాలుగా భావిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.