Ram Mandir : రాముడి విగ్రహానికి వాడిన రాయి ఏ కాలం నాటిదో తెలుసా?
X
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో సోమవారం నాడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. ఇక బాల రాముడిని చూడటానికి సామాన్య భక్తులు కూడా వేల సంఖ్యలో వచ్చారు. నల్లటి దేహఛాయతో బాల రాముడు భక్తులకు దర్శనమిచ్చారు. బాల రాముడిని చూసి భక్తిపారవశ్యంలో మునిగితేలారు భక్తులంతా. ఈ నేపథ్యంలోనే రాముడి విగ్రహ తయారీకి వాడిన రాయి గురించి చర్చ నడుస్తోంది. దానికి కారణం ఆ రాయి అతి పురాతనమైనది కావడమే. బాల రాముడిని తయారు చేయడానికి 250 కోట్ల ఏళ్ల కిందటి నల్లరాతితో 51 ఇంచుల బాల రాముడి విగ్రహాన్ని తయారు చేయించినట్లు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ప్రతినిధులు తెలిపారు. ఆ రాయి కర్ణాటకలో లభించిందని వారు పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్‌ఎస్ వెంకటేష్ ధృవీకరించారు. రాముడి విగ్రహం కోసం వాడిన నల్లరాయి 2.5 బిలియన్ సంవత్సరాల నాటిదని ఆయన అన్నారు. ఈ రాయి చాలా మన్నికైనదని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని వేల ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు. కాగా నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందిన మైసూరు జిల్లాలోని జయపుర హోబ్లీ గ్రామం నుండి రాముడి విగ్రహం కోసం గ్రనైట్ రాయిని తీసుకున్నారు. మైసూరుకు చెందిన 38 ఏళ్ల అరుణ్ యోగిరాజ్ ఈ రాయిని అందమైన విగ్రహంగా చెక్కారు. రామ్ లాలా విగ్రహాన్ని రూపొందించడానికి అతనికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది.