ఆయన బతికున్నప్పుడు ఇస్తే సంతోషపడేవారు.. సౌమ్యా స్వామినాథన్
X
తన తండ్రి బతికి ఉన్న సమయంలో అవార్డు వస్తే ఆయన కూడా ఎంతో సంతోషించేవారని సౌమ్యా స్వామినాథన్ అన్నారు. దేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కూతురు, డబ్ల్యూహెచ్వో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్పందించారు. తన తండ్రికి భారతరత్న అవార్డు రావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి జీవించి ఉన్నప్పుడు ఈ అవార్డు ఇచ్చి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారని అన్నారు. తన తండ్రి ఏనాడు అవార్డుల కోసం పాకులాడలేదని అన్నారు. తనను ఎవరో గుర్తించాలనే ఆలోచనతో ఆయన ఏనాడు పని చేయలేదని అన్నారు. చేసిన పనుల ద్వారానే ఆయన ప్రేరణ పొంది ముందుకు వెళ్లారని అన్నారు.
చివరి శ్వాస వరకు తనకు ఇష్టమైన వ్యవసాయం రంగం గురించే పని చేశారని అన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో తెలిపారు. ఇక ఈ ఏడాదికి గానూ అంతకు ముందు కర్పూరి ఠాగూర్, ఎల్కే అద్వానీలకు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారం లభించింది.