Suchana Seth : కన్న బిడ్డ ప్రాణాలు తీసిన తల్లి.. ఎందుకిలా చేసిందంటే..?
X
అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే ప్రేమ.. అమ్మ అంటే ఆప్యాయత అమ్మ అంటే త్యాగం. అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే కవులకు కూడా సమయం సరిపోదు. అమ్మ లేకుంటే జన్మే ఉండదు మనిషికి. కానీ తాను నవమోసాలు మోసి కని పెంచిన ఓ బిడ్డ పట్ల ఓ తల్లి క్రూరంగా వ్యవహరించింది. పేగు బంధాన్ని మరిచి నాలుగేళ్ల కన్న కొడుకును కిరాతకంగా హత్య చేసింది. మానవ విలువలకు మాయని మచ్చలాంటి ఈ ఘటన గోవాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 39 ఏళ్ల సుచనా సేథ్ బెంగుళూరులోని మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీసీఈవోగా పని చేస్తోంది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె గత శనివారం నాలుగేళ్ల కొడుకును తీసుకొని గోవా వెకేషన్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే గోవా కాండలిమ్‌లోని బనియన్ గ్రాండ్ హోటల్‌లోకి ఆమె శనివారం తన కుమారుడితో కలిసి వెళ్లింది. అక్కడే ఆమె తన కుమారుడిని చంపి బ్యాగ్ లో కుక్కింది. అనంతరం సోమవారం హోటల్ ను ఖాళీ చేసి బయటకు వెళ్లేందుకు రిసెప్షన్ వద్దకి బ్యాగ్ తో వచ్చింది. తాను బెంగళూరుకు వెళ్లాలని అందుకు క్యాబ్ బుక్ చేసుకుంటానని సిబ్బందితో చెప్పింది. అయితే వాళ్లు క్యాబ్ అంతా కంఫర్ట్ కాదు.. ఫ్లైట్ లో వెళ్లండి మేడమ్ అంటూ ఆమెకు సలహా ఇచ్చారు. అయితే ఆమె మాత్రం క్యాబ్ లోనే వెళ్లింది. ఇక హోటల్ లోకి వచ్చేటప్పుడు కొడుకుతో వచ్చి వెళ్లేటప్పుడు మాత్రం ఒక్కతే వెళ్లడంతో హోటల్ సిబ్బందికి సందేహం వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఉన్న హోటల్ గదిని పరిశీలించగా అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో హోటల్ యాజామాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కనుగొన్న పోలీసులు డ్రైవర్ తో కొంకణి బాషలో మాట్లాడారు. డ్రైవర్ ఫోన్ ద్వారా సుచనా సేథ్ తో మాట్లాడగా తన కొడుకు తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని చెప్పింది.
అయితే ఆమె ఇచ్చిన అడ్రస్ ఫేక్ అని తేలడంతో దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్‌కు పోలీసులు ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ నేరుగా తన కారును సమీపంలో ఉన్న చిత్రదుర్గ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఆ కారులోని ఓ బ్యాగ్‌లో కుమారుడి శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇండోనేషియాలో ఉన్న భర్త వెంకట్ రామన్ కు తెలియజేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సుచనాను పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. లింకిడిన్ పేజీ ప్రకారం "100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021"లో సుచనా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్లు ఆమె లింకిడిన్‌లో ఉంది. డేటా సైన్స్ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడంలో ఆమెకు 12 ఏళ్ల అనుభవం ఉన్నది. కాగా సుచనా సేథ్, వెంకట్ రామన్ కొన్ని నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం అప్లై చేసుకోగా కేసు చివరి దశలో ఉంది. భర్త మీద ఉన్న కోపంతోనే సుచనా సేథ్ కొడుకును చంపినట్లు తెలుస్తోంది. అయితే ఆమె కొడుకును ఎలా చంపింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.