Home > జాతీయం > ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు!

ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు!

ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు!
X

పార్లమెంట్ ఎన్నికల కోసం ఎన్డీఏతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో పార్టీల బలాబలాలను బట్టి పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే యూపీలో సమాజ్ వాదీ పార్టీతో లోక్ సభ స్థానాలకు సంబంధించి ఒప్పందం కుదర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఢిల్లీలో కూడా ఆప్ తో పొత్తు ఖరారు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పొత్తు దాదాపు ఖరారు అయిందని, కేవలం ప్రకటన మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో మొత్తం 7 లోక్ సభ స్థానాలు ఉండగా ఆప్ కు 4 సీట్లిచ్చి తాను 3 సీట్లు తీసుకోవడానికి కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చలు ముగిశాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆప్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రమైన పంజాబ్ లో కూడా ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఉంటాయని చర్చ నడుస్తోంది. అయితే పంజాబ్ లో ఆప్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని అక్కడి సీఎం భగవంత్ మాన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ లో కూడా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదురొచ్చని వార్తలు వస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ యూపీలో ఎస్పీతో పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల ఒప్పందం కుదుర్చుకుంది. యూపీలో మొత్తం 80 లోక్ సభ సీట్లు ఉండగా ఎస్పీ 63 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లు పంచుకున్నాయి. ఇక కాంగ్రెస్ కోరిన స్థానాల్లో రాయ్ బరేలి, ఆమేథీ తో పాటు ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా ఉంది.

కాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర యూపీలో కొనసాగుతోంది. రాహుల్ యాత్రకు జనాలు నీరాజనాలు పలుకుతున్న నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కూటమికి మెజారిటీ స్థానాలు దక్కవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మార్చి రెండో వారంలో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా కొద్దివారాలు మాత్రమే గడువు ఉండగా దేశ రాజకీయాల్లో ఇటీవల అనేక సంచలన మార్పులు జరిగాయి. మొన్నటి దాక ఇండియా కూటమిలో ముఖ్య పాత్ర పోషించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూటమి నుంచి వైదొలగి ఎన్డీఏలో చేరారు. అనంతరం బీజేపీ సహకారంతో మళ్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అలాగే మనీ లాండరింగ్ కేసు ఆరోపణలతో ఇండియా కూటమిలో ఉన్న మరో సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయగా ఆ పదవిని చంపయ్ సోరెన్ ను వరించింది. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.


Updated : 22 Feb 2024 10:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top