బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. నోబెల్ గ్రహీతకు జైలు శిక్ష
X
ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డైన నోబెల్ సాధించిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. న్యాయస్థానం అతడికి 6 నెలల జైలు శిక్ష వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ కు చెందిన నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్ కు న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష విధించింది. అయితే యూనస్ మద్దతుదారులు ఆయన అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజకీయ కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు. కాగా 83 ఏళ్ల యూనస్ ముహమ్మద్ పేదరిక వ్యతిరేక ప్రచారానికి 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అయితే కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో ఆయన దోషిగా తేలారు. యూనస్ తో పాటు అయనకు చెందిన గ్రామీణ్ టెలికాం సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులు దోషులుగా తేలారు. వారికి 6 నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 83 ఏళ్ల యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారనే ఘనత సాధించారు. కానీ ఇందుకు విరుద్ధంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో పీలుస్తున్నారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యూనస్ ముహమ్మద్ జైలు శిక్ష వ్యవహారం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.