సీఈసీ, ఈసీ' బిల్లును ఆమోదించిన పార్లమెంట్
X
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ)నియామకాలకు సంబంధించిన బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించగా.. తాజాగా లోక్ సభ కూడా ఆమోదించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 'ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయిట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు-2023' పేరు మీద బిల్లును అధికార పార్టీ లోక్ సభలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించింది. ఇప్పటి వరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. అయితే ఈ కొత్త బిల్లుతో సెర్చ్, ఎంపిక కమిటీలు సీఈసీ, ఈసీల నియామకం బాధ్యతను నిర్వహించనున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టంలోని లోపాలను సవరించి ఈ కొత్త చట్టాన్ని తెచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.