జార్ఖండ్ సీఎం మార్పు.. జోరుగా ప్రచారం!
X
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని, ఈ నేపథ్యంలోనే హేమంత్ సోరెన్ అలర్జ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ తాను సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆ స్థానంలో తన సతీమణి కల్పనా సోరెన్ ను కూర్చోబెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే విషయమై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. ఈడీ ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేయడం ఖాయమని సీఎం హేమంత్ సోరెన్ భయపడుతున్నారని, అందుకే సీఎం కుర్చీలో తన భార్య కల్పనను కూర్చోబెట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. జేఎమ్ఎమ్ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా ఉదంతమే అందుకు నిదర్శనమని అన్నారు. సీఎం సతీమణి కోసమే సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారని ఆరోపించారు. లేకుంటే రాజీనామా పత్రాన్ని ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే స్పీకర్ ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేసింది వ్యక్తిగత కారణాల వల్ల కాదని, సీఎం హేమంత్ సోరెన్ ఆదేశాల మేరకే ఆయన రాజీనామా చేశారని అన్నారు.