పార్లమెంట్ ఘటనపై ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే
X
పార్లమెంట్ భద్రతా వైఫ్యలంపై ప్రధాని మోడీ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన దురుదృష్టకరమని ప్రధాని అన్నారు. ఓ జాతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్లమెంట్ దాడిపై మోడీ స్పందించారు. భద్రతా వైఫల్యం ఘటన బాధాకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఈ ఘటనా తీవ్రతను తక్కువ అంచనా వేయవద్దని ప్రధాని హెచ్చరించారు. పార్లమెంట్ పై దాడి ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశాలు జారీ చేశారని, సమగ్ర దర్యాప్తు జరుగుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. విచారణ కొనసాగుతోందని, అనవసర రాద్ధాంతం చేయవద్దని విపక్షాలకు మోడీ హితవు పలికారు.
కుట్ర వెనుక ఉన్న నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా ఈ నెల 16న కొందరు దుండగులు పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా ప్రవేశించి స్మోక్ బాంబులతో నానా భీభత్సం సృష్టించారు. అనంతరం ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై ప్రధాని మోడీ స్పందించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ తాజా ఘటనపై పై విధంగా స్పందించారు. ఇక రేపు పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.