దమ్ముంటే అమేథీలో పోటీ చెయ్.. రాహుల్ కు స్మృతి ఇరానీ సవాల్
X
దమ్ముంటే అమేథీలో పోటీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. సోమవారం స్మృతి ఇరానీ తన నియోజకవర్గంలో జన్ సంవాద్ కార్యక్రమం నిర్వహించగా.. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా అమేథీ చేరుకుంది. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే అమేథీలో మరోసారి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాహుల్ పై అమేథీ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇవాళ స్పష్టంగా కనిపించిందని స్మృతి ఇరానీ అన్నారు. గత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి గెలిచాక అమేథీ ఓటర్ల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు చేశారని, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పట్ల అమేథీ ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ అమేథీలో అడుగుపెడితే ఖాళీగా ఉన్న వీధులు దర్శనమిచ్చాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. అయితే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి అమేథీ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారు.
2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై 55 వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడ్నించి పోటీ చేస్తారన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. అమేథీలో ఎవరు పోటీ చేయాలన్న అంశం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి మూడు పర్యాయాలు గెలిచారని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేసేవారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ముఖ్యమైన నియోజకవర్గం అని తెలిపారు. కాగా స్మృతి ఇరానీ తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ సారి రాహుల్ గాంధీపై గెలిచేంత సత్తా ఆమెకు లేదని అన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.