Yogi Adityanath : 500 ఏళ్ల కల నెరవేరింది.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
X
అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వేడుకలకు ప్రధాని మోడీ, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తో పాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి కూడా పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం యూపీ సీఎం యోగి మాట్లాడారు. 500 ఏళ్ల నాటి కల నేడు నెరవేరిందని అన్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా రామ నామం మార్మోగుతోందని అన్నారు. అయోధ్యలోని వాతావరణం చూశాక త్రేతాయుగంలో ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుందని అన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని అన్నారు.
ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా అయోధ్య వర్ధిల్లుతుందని, మొత్తం ప్రపంచానికి దివ్వ, భవ్య అయోధ్య సాక్షాత్కారిస్తోందని అన్నారు. అయోధ్య నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం ప్రధానమంత్రి మోడీ ధృడసంకల్పం, దూరదృష్టి వల్లే సాధ్యమైందని అన్నారు. రానున్న రోజుల్లో అయోధ్య నగరం ఓ ఆధ్యాత్మిక నగరంగా పరిఢవిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ రామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠతో 100 కోట్ల హిందువులు భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారని యోగి అన్నారు.