WFI కార్యకలాపాలపై IOA కమిటీ
X
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ పై ఆరోపణలు రాగా.. అతడిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వారం కిందట భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషన్ సన్నిహితుడు ఎన్నికైన నేపథ్యంలో భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పగా.. మరో రెజ్లర్ బజరంగ్ పూనియా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అప్రమత్తమై కేంద్ర క్రీడా శాఖ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త కమిటీని సస్పెండ్ చేసింది. ఇక నిన్న మరో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. WFI కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది. అథ్లెట్ల ఎంపిక, అంతర్జాతీయ ఈవెంట్‌లలో పాల్గొనేందుకు అథ్లెట్ల కోసం ఎంట్రీలను సమర్పించడం, క్రీడా కార్యకలాపాలను నిర్వహించడం, బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం, వెబ్‌సైట్ నిర్వహణ మరియు ఇతర సంబంధిత బాధ్యతలను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ చూసుకుంటుందని పేర్కొంది.