ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్
X
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ టోర్నీ ఫైనల్స్ లో రష్యన్ మూడో సీడ్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ ను ఓడించి విజేతగా నిలిచాడు. భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.ఫైనల్ మ్యాచ్ జానిక్ సిన్నర్ కు మద్వెదెవ్ కు మధ్య హోరా హోరీ పోటి నెలకొంది. ఈమ్యాచ్ లో జానిక్ సిన్నర్ మద్వెదెవ్ ను 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు.5 సెట్లుగా జరిగిన మెన్స్ సింగిల్స్ టోర్నీలో తొలి రెండు సెట్లను చేజార్చుకున్న జానిక్ సిన్నర్ తర్వాత మూడు సెట్లలో ప్రత్యర్ధికి చెమటలు పట్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ సాధించిన ఆనందంలో గర్వంగా చేతుల్లో కప్ ను ఎత్తుకొని ముద్దాడాడు జానిక్ సిన్నర్. మొదటి రెండు సెట్లను సునాయాసంగా గెలిచిన మెద్వెదెవ్ ఆటతీరు చూసి ఈసారి టైటిల్ మరో రౌండ్ లో రష్యన్ ఆటగాడి వశం అవుతుందని అందరూ భావించారు.
ఆ క్షణంలోనే ఇటలీ ప్లేయర్ జానిక్ సిన్నర్ తన అద్భుతమైన ఆటతీరును బయటపెట్టి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మెన్స్ ఫైనల్ పోరులో చివరి మూడు రౌండ్లు ఆట చూసిన వారికి కొత్త అనుభూతిని కలిగించింది. జానిక్ సిన్నర్ పదునైన సర్వీసులు, కచ్చితమైన ప్లేస్ మెంట్ల, బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో మెద్వెదెవ్ ను ముప్పుతిప్పలు పెట్టాడు.
చూస్తుండగానే వరుసగా మూడు సెట్లు కైవసం చేసుకున్న జానిక్ సిన్నర్ తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సిన్నర్ కు ట్రోఫీతో పాటు రూ.26 కోట్ల ప్రైజ్ మనీని కూడా అందుకున్నాడు.