ఖేల్ రత్న, అర్జున్ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నా..
X
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదే కారణంతో బజరంగ్ పూనియా పద్మశ్రీ అవార్డున వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక అదే బాటలో పయనించారు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్. ఖేల్ రత్న, అర్జున్ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. లేఖలో రెజ్లింగ్ వివాదాలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. 'భేటీ పడావో బేటీ బచావో' అనే ప్రభుత్వ కార్యక్రమ యాడ్ లో సాక్షి మాలిక్ నటించారని, ఆమె తనలాంటి ఎంతోమందికి తన ఆట తీరుతో ప్రేరణగా నిలిచారని అన్నారు. కానీ ఆమెలాంటి క్రీడాకారులే రెజ్లింగ్ కు గుడ్ చెప్పిందంటే రెజ్లింగ్ ఫెడరేషన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
తాము దేశంలోని ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలనుకుంటున్నామని, అవార్డుల మీద మక్కువ తమకు లేదని తెలిపారు. ఇప్పటికైనా రెజ్లింగ్ ఫెడరేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని ప్రధాని మోడీని వినేష్ ఫోగట్ కోరారు. కాగా WFIకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. సంజయ్ సింగ్ WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడని, ఈ క్రమంలోనే ఆయన ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పగా.. బజరంగ్ పూనియా పద్మశ్రీని వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ప్యానెల్ ను కేంద్ర క్రీడా శాఖ సస్పెండ్ చేసింది. తాజాగా ఫోగట్ కూడా తన అవార్డులను తిరిగి ఇవ్వడంతో రెజ్లింగ్ వివాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చగా మారింది.