మంత్రి వెంకట్ రెడ్డిపై హెలికాప్టర్తో పూలవర్షం
X
రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత గడ్డ నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి జన నీరాజనం పలికారు. నల్లగొండ బైపాస్ వద్ద అడుగడుగున పూలతో జనం ఆయనకు స్వాగతం పలికారు. ఇక కొంతమంది కార్యకర్తలు ఏకంగా హెలికాప్టర్ ను ఉపయోగించి ఆయనపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక డీజే, డప్పు చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. మంత్రి రాకతో నల్లగొండ రోడ్డంతా వాహనాలతో నిండిపోగా.. పట్టణమంతా కాంగ్రెస్ జెండాలతో కళకళలాడింది. ఆయనను కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బారులు తీరారు.
ఇక జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు మంత్రికి పుష్ప గుశ్చంతో స్వాగతం పలికారు. జిల్లాకు వచ్చిన మంత్రి అక్కడ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాగా ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా.. ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మంత్రులుగా సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.