ఎల్కే అద్వానీకి 'భారతరత్న'.. నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే
X
బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోడీ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారం రావడం పట్ల ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రముఖ నటుడు, పొలిటీషియన్ ప్రకాశ్ రాజ్ ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం పట్ల ట్విట్టర్ లో సెటైరికల్ పోస్టు చేశారు. తన ఎక్స్ ఖాతాలో మోడీ, ఎల్కే అద్వానీకి సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని పోస్టు చేశారు. ఇక ఈ చిత్రానికి థాంక్స్ గివింగ్ డే అంటూ ప్రకాశ్ రాజ్ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక అందులో మొత్తం మూడు చిత్రాలు ఉండగా మొదటిదానిలో 1990లో అద్వానీ ఓ కుర్చీ తయారీకి పూనుకొని రంపంతో కుర్చీకి కావాల్సిన భాగాలను కోస్తుంటారు. ఇక రెండో చిత్రంలో 2009 ప్రాంతంలో అద్వానీ ఆ కుర్చీని సగానికి పైగా పూర్తి చేస్తూ కనిపిస్తారు. చివరి చిత్రంలో 2014లో ఆ కుర్చీ మొత్తం పూర్తి కాగా.. అందులో నరేంద్ర మోడీ కూర్చొని ఉండగా కుర్చీ వెనకాల అద్వానీ కనిపిస్తుంటారు. అద్వానీ ఎంతో కష్టపడి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే మోడీ పీఎం కుర్చీలో కూర్చున్నారని ఈ చిత్రాన్ని చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. అద్వానీకి దక్కాల్సిన ప్రధాని పీఠాన్ని లాక్కుని ఇప్పుడు భారతరత్న అవార్డు ప్రకటిస్తూ మోడీ చాలా తెలివిగా వ్యవహరించారని కొందరు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.