ఇంటి వెనుక గుంత తవ్వి డబ్బు దాచిపెట్టిన మహిళ.. తర్వాత ఏమైందంటే?
X
ఎవరైనా డబ్బును బ్యాంకులో దాచిపెడతారు లేకుంటే ఇంట్లో బీరువాలో దాచిపెడతారు. అది కాకుంటే ఏదైన బ్యాగులో దాచిపెడతారు. అయితే మహబూబాబాద్ జిల్లా జగ్గు తండాకు చెందిన ఓ వృద్ధురాలు కష్టపడి కూడబెట్టిన సొమ్మును ఇంటి వెనుక ఓ చిన్న గుంత తవ్వి అందులో పాతిపెట్టింది. దొంగల భయంతో దాదాపు రూ.2.5 లక్షల డబ్బును ఓ ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇంటి వెనుక భూమిలోపల పాతిపెట్టింది. అయితే కొంతకాలం దాకా ఆ వృద్ధురాలు అటువైపు వెళ్లలేదు. దీంతో అక్కడ చిన్నచిన్న చెట్లు మొలిసి డబ్బు దాచిన చోటు గుర్తు పట్టకుండా అయింది.
కాగా తాజాగా ఆ డబ్బును తీసుకునేందుకు ఇంటి వెనుక వెళ్లి పలు చోట్ల గుంతలు తవ్వి చూడగా ఎక్కడా ఆమె డబ్బు కనిపించలేదు. దీంతో ఆ వృద్ధురాలు లబోదిబోమంది. తన డబ్బును దొంగలు ఎత్తుకుపోయారంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వృద్ధురాలు ఫిర్యాదుతో ఆమె చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాల్లో వెతికి భూమిలో పాతిపెట్టిన డబ్బును వెలికి తీశారు. అనంతరం వృద్ధురాలికి అప్పగించారు. డబ్బు దొరకడంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.