Rahul Gandhi : రాహుల్పై కేసు నమోదుకు అస్సాం సీఎం ఆదేశాలు
X
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈశాన్య భారతంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం రాహుల్ నాగాలాండ్ నుంచి తిరిగి అస్సాంలోని గువాహటి నగరానికి బయల్దేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ మార్గాన్ని మార్చుకోవాలని అంతకు ముందు అస్సాం ప్రభుత్వం ఆదేశించింది. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా గువాహటిలో యాత్రకు అనుమతించడం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ రోజు ఉదయం వెల్లడించారు. నగర బైపాస్ మీదుగా వెళ్లాలని ఆయన సూచించారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున గువాహటి చేరుకోగా.. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇదే మార్గంలో బజ్రంగ్ దళ్ యాత్ర చేపట్టిందని, అలాగే బీజేపీ చీఫ్ నడ్డా ర్యాలీ నిర్వహించారని అన్నారు. తన యాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని, తానేమీ చట్టాన్ని అతిక్రమించలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పై కేసు నమోదు చేయాలని అక్కడి డీజీపీని ఆదేశించారు. జనాన్ని రెచ్చగొట్టడం తమ సంస్కృతి కాదని, ఇలాంటి నక్సలైట్ వ్యూహాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు రాహుఅల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించానని, అందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పినట్లు తెలిపారు. కాగా సోమవారం కూడా రాహుల్ గాంధీ ప్రముఖ వైష్ణవ సాధువు శ్రీమంత్ శంకర్ దేవ జన్మస్థలి బతద్రవ సత్రను దర్శించుకోకుండా అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.