Home > తెలంగాణ > డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి.. బండి సంజయ్

డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి.. బండి సంజయ్

డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి.. బండి సంజయ్
X

డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోవడం వల్ల కలిగే నష్టాలేంటో కరీంనగర్ తీగలగుట్టపల్లి రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తీగలగుట్టపల్లి వద్ద జరుగుతున్న ఆర్వోబీ పనులను గురువారం బండి సంజయ్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను నిలదీయగా వాళ్లు నీళ్లు నమిలారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ సాకుతో పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. భూసేకరణ సమస్యను తన దృష్టికి ఎందుకు తేలేదని నిలదీశారు. కొట్టుకుపోయిన రోడ్డుకు వెంటనే తాత్కాలిక మరమ్మతు చేయాలని ఆదేశించారు. నాసిరకం పనులు చేస్తే కాంట్రాక్టర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిర్ణీత వ్యవధిలో ఆర్వోబీ పనులను పూర్తి చేయాల్సిందేనని, పనుల విషయంలో జవాబుదారీగా ఉండాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగించడానికి కేంద్రం తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ మంజూరు చేసి, తన వాటా నిధులను కూడా విడుదల చేసిందని అన్నారు. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ ఆర్వోబీ పనులు పట్టాలెక్కలేదని అన్నారు. చివరకు సేతు భారతం పథకం కింద 100 శాతం నిధులు (రూ.154 కోట్లు) కేంద్రమే మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేయలేదన్న ఆయన.. ఫలితంగా ఈ ఆర్వోబీ పనులు నిదానంగా సాగుతున్నాయని అన్నారు. ఆర్వోబీ పనులు జరుగుతున్న చోట రోడ్లు కొట్టుకుపోయి దుమ్ము, ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.




Updated : 11 Jan 2024 3:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top