గజ్వేల్ ఓటమి నాలో మరింత కసిని పెంచింది.. ఈటల రాజేందర్
X
గజ్వేల్ లో ఓటమితో తనలో మరింత కసి పెరిగిందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ టౌన్, తూప్రాన్ రూరల్, మనోరాబాద్, ఇతర మండలాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ మీద తాను నిలబడ్డానని, అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలిచారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న వ్యక్తి కాదని, డబ్బును నమ్ముకున్న వ్యక్తి అని అన్నారు. స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని అక్రమంగా ఎన్నికల్లో గెలిచారని కేసీఆర్ పై మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తాను గజ్వేల్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే ప్రసక్తేలేదని, ప్రజా సమస్యల పరిష్కారినికి నిత్యం ప్రజల్లో ఉండి పోరాడుతానని అన్నారు.
విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తనకు ఓటమి తెలియదన్న ఈటల.. తాజా ఓటములు తనలో తీవ్ర కసిని పెంచాయని మరోసారి స్పష్టం చేశారు. ఓటమికి గల కారణాలపై సమీక్ష జరిపి.. వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి 15 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని, ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానల్లోనూ ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యారు. ఈటల రాజేందర్ పై హుజురాబాద్ లో పైడి కౌషిక్ రెడ్డి విజయం సాధించగా.. గజ్వేల్ లో కేసీఆర్ విజయం సాధించారు.