కేటీఆర్ను విమర్శించే స్థాయి మల్లు రవికి లేదు.. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి
X
కేటీఆర్ను విమర్శించే స్థాయి మల్లు రవికి లేదని బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీని ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అదే కాంగ్రెస్ నేతల విమర్శలకు కేటీఆర్ స్పందిస్తే తొందరపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కటంటే తాము పది అంటామని స్పష్టం చేశారు. మల్లు రవి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రావుల ఖండించారు. మల్లు రవి తన స్థాయి మరిచి కేటీఆర్ గురించి మాట్లాడటం తగదని రావుల సూచించారు. అనేక శాఖలను మంత్రిగా సమర్థంగా నిర్వహించి తెలంగాణ అభివృద్ధిపై తన మార్క్ చూపించిన నాయకుడు కేటీఆర్ అని తెలిపారు. పాలనాపరంగా అనేక సంస్కరణలు తెచ్చిన నేత అని కొనియాడారు. టీఎస్ఐపాస్‌తో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని అన్నారు. ఐటీ రంగంలో విప్లవానికి నాంది పలికి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో మేటిగా నిలిపిన నాయకుడని అన్నారు. శశి థరూర్ లాంటి కాంగ్రెస్ నేత, ఎందరో అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న నాయకుడు కేటీఆర్ అని అన్నారు. దావోస్ పర్యటనలకు అర్థాన్ని మార్చిన వ్యక్తి అని అన్నారు.
తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధూ, హిందీ ఇలా ప్రముఖ భాషలన్నిటిలో వాక్పటిమను ప్రదర్శించే కేటీఆర్ లాంటి నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. పెద్ద నాయకుడు కావడానికి ఇంకేం లక్షణాలు కావాలని మల్లు రవిని ప్రశ్నించారు. రాహుల్ ఆదేశాల కన్నా మోడీ ఆదేశాలనే రేవంత్ రెడ్డి ఎక్కువగా పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల నుంచి కాంగ్రెస్ బీజేపీ బంధం బలంగానే కొనసాగుతోందని అన్నారు.ఓట్ల బదిలీయే కాదు ఎన్నికలకు ముందు అభ్యర్థుల్ని బదిలీ చేసుకున్న పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు అని విమర్శించారు. హామీల అమలు విశ్వనీయతలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎన్నో రెట్లు మెరుగని అన్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి ఇస్తామన్న తొమ్మిది గంటల కరెంటును ఇవ్వలేదని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చేయలేదని అన్నారు. ఇలా ఎన్నో ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలా తమకు చెప్పేది అని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి నిజాయితీని చాటుకుంటే ప్రజలు హర్షిస్తారని, లేకుంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.