Vinod Kumar : సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడొచ్చా?: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
X
(Vinod Kumar) సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారని, దేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి భాష వాడరని అన్నారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడు అలాంటి భాష వాడలేదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, ఇండ్ల గురించి చాలా మాట్లాడామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. మోసానికి చిహ్నం కాంగ్రెస్ పార్టీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అవసరమా అని కొంతమంది అడుగుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి చేసేదేమీ ఉందని అంటున్నారని అన్నారు. మోడీని తీసుకొచ్చి కరీంనగర్ కు రైల్వే లైన్ వేయించింది తాను అని అన్నారు.
గత ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గానికి ఏం చేయలేదని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, హక్కులు సాధించాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ధ ఉండదని, వాళ్లకు జాతీయ రాజకీయాలే ముఖ్యమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించిందని అన్నారు. ఇక బీజేపీకి అభివృద్ధి తప్ప మిగతావన్నీ కావాలని ఎద్దేవా చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.