రేపు కాంగ్రెస్‌లోకి నలుగురు బడా బీఆర్ఎస్ నేతలు!
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, తీగల కృష్ణా రెడ్డి, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా వీరంతా ఇప్పటికే సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలోన వారంతా త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఆ వ్యాఖ్యలను వారు ఖండించడం గానీ లేక సపోర్టు చేయడం గానీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ లో వారి చేరిక ఖాయమని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే వారు రేపు హస్తం గూటికి చేరనున్నారు. కాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే వారంతా తమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను సీఎంకు చెప్పుకోవడానికే వెళ్లామని స్పష్టం చేశారు.