KTR : ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్
X
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా.. నియోజకవర్గాలవారీగా కేటీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్.. సమావేశం ముగిసిన అనంతరం యూసఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటోలో ఆయనతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఉన్నారు. కాగా అంతకు మందు జరిగిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించిందని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయామని అన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. రానున్న పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని, తెలంగాణలో మళ్లీ అదే చేశారని అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రైతులకు రైతు బంధు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌కు బంగారు పళ్లెంలో తెలంగాణను పెట్టి ఇచ్చామన్న కేటీఆర్.. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతారని అన్నారు.