Home > తెలంగాణ > తెలంగాణ తెచ్చిన నాడే బీఆర్ఎస్ గెలిచింది.. కేటీఆర్

తెలంగాణ తెచ్చిన నాడే బీఆర్ఎస్ గెలిచింది.. కేటీఆర్

తెలంగాణ తెచ్చిన నాడే బీఆర్ఎస్ గెలిచింది.. కేటీఆర్
X

తెలంగాణ తెచ్చిన నాడే బీఆర్ఎస్ గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీఆర్ఎస్ మళ్లీ గెలవడం సాధ్యంకాదని కొందరు పనికట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడుతో జోరుగా నడిచిన కారు సర్వీసింగ్ కు వచ్చిందని అన్నారు. ఇంకో రెండు నెలల్లో తిరిగి స్పీడ్ అందుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఇటుకతో కొడితే తాము రాళ్లతో కొడుతామని అన్నారు. అనుకోకుండా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు, రూ.2 లక్షల రుణమాఫీ అన్నారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని, ఏం చేయాలో తెలియడం లేదని అన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని అని, ఇప్పుడేమో కొందరికి కొన్ని అని అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఖజానా ఖాళీ చేసి పోయారు.. మిగతా వాళ్లకు ఎక్కడి నుంచి డబ్బు తేవాలని ఏదేదో చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంలాగా మాట్లాడటం లేదని, లంకె బిందెలు.. ఖాళీ కుండలు అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. లంకె బిందెల అర్ధరాత్రి పూట దొంగలు తిరుగుతారని, సీఎంలు.. రాజకీయ నాయకులు తిరగరని సెటైర్లు వేశారు.

ఎన్నికల ముందు రుణం రాని రైతులు రుణం తీసుకోండని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని అన్నారని చెప్పారు. కానీ మూడు నెలలు గడిచినా ఒక్కరికీ కూడా రుణమాఫీ చేయలేదని అన్నారు. ఎన్నికల సమయంలో నవంబర్, డిసెంబర్ లో కరెంట్ బిల్లులు కట్టవద్దని చెప్పిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు కరెంట్ బిల్లులు కట్టడం లేదని అన్నారు. అవ్వతాతలకు రూ.4వేల పెన్షన్, ఇంట్లో కోడలికి రూ.2500 ఇస్తామని చెప్పి.. ఇప్పటికీ ఆ ఊసే లేదని అన్నారు. రూ.2500 కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

రూ.500కే గ్యాస్ ఇస్తామని చెప్పారని, అందుకోసం కోటి 24 లక్షల కుటుంబాలు గ్యాస్ పథకం ఎదురు చూస్తున్నారని అన్నారు. అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ కోసం కోటి 34 లక్షల 50 వేల కుటుంబాలకు ఉచిత కరెంట్ కోసం ఎదురు చూస్తున్నాయని, మరి వారందరికీ ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని కేటీఆర్ నిలదీశారు. మార్చి 17 నాడు 100 రోజులు అవుతుంది.. అప్పటి దాక ఆగుదామని అనుకున్నామని, కానీ కాంగ్రెస్ తీరు చూశాక తాము కూడా అటాక్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఒక్క సంవత్సరం కార్యకర్తలను కాపాడుకుంటే ఆ తర్వాత నాలుగేళ్లు కార్యకర్తలే చూసుకుంటారని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు డబ్బులు వారం రోజుల్లో ప్రతి ఒక్క రైతుకు వచ్చేదని అన్నారు. కానీ నేడు నెలలు దాటినా రైతు బంధు రావడం లేదని అన్నారు. ఎండాకాలం రానేరాలేదని, అప్పుడే మంచినీళ్లకు సమస్య ఏర్పడిందని అన్నారు.వచ్చిపోయే సీఎంలు చాలా మంది ఉండొచ్చు గానీ తెలంగాణ తెచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఉన్నంత కాలం చరిత్రలో కేసీఆర్ ఉంటారని అన్నారు. మోడీ హవా లేదని, అంతా బోగస్ అని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ బీజేపీ అని అన్నారు. కృష్ణా నీళ్లను కేఆర్ఎంబీకి అప్పజెప్పి కాంగ్రెస్ తెలంగాణ రైతులను మోసం చేసిందని అన్నారు. ఢిల్లీ చేతిలో తెలంగాణ జుట్టును పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందని అన్నారు. లేకుంటే బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటాయని అన్నారు.



Updated : 25 Feb 2024 9:39 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top