అధైర్య పడకండి..అన్ని విధాలుగా అండగా ఉంటా: కేటీఆర్
X
‘అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త జంటలను ఆశీర్వదిస్తూ, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తూ, గ్రామాల్లోని పలువురిని పలకరించారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న వారిని దవాఖానలో చేర్పించి బాగుచేస్తానని ధీమానిచ్చారు.హైదరాబాద్ నుంచి బయల్దేరిన కేటీఆర్ ఉదయం 11.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరుకున్నారు. సోషల్ మీడియా కార్యకర్త సాయికృష్ణ వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి బొప్పాపూర్‌కు చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న ప్రశాంత్‌రెడ్డి, అఖిల దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు గుండాడి వెంకటరెడ్డి నివాసానికి చేరుకుని నాలుగు రోజుల క్రితం వివాహం చేసుకున్న నరేశ్‌రెడ్డి, చందన నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఎల్లారెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘ భవనాన్ని సందర్శించారు. సంఘ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డితోపాటు డైరెక్టర్లను అభినందించారు. అనంతరం హరిదాస్‌నగర్‌లో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు గృహప్రవేశానికి హాజరయ్యారు. అక్కడే జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. అదే గ్రామంలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసిన ‘నయార’ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి ముస్తాబాద్ మండలం చేరుకుని అయ్యప్ప ఆలయంలో జరిగిన మహాపడి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్పలతో కలిసి సహాపంక్తి భోజనం చేసి మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ యూత్ నాయకుడు గుణశేఖర్ సోదరి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి పోతుగల్‌కు చేరుకుని గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతంతో చనిపోయిన హెల్పర్ జంగ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను, గంభీరావుపేట మండలం శ్రీగాధలో పార్టీ సీనియర్ నాయకులు మాణిక్‌రావు, చొక్కారావు కుటుంబ సభ్యులను, మండల కేంద్రంలోని ఎంపీటీసీ దేవేందర్, పార్టీ పట్టణాధ్యాక్షుడు వెంకట్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.