Home > తెలంగాణ > ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి.. సీఎం రేవంత్

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి.. సీఎం రేవంత్

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి.. సీఎం రేవంత్
X

ధరణిలో పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీసీఎల్ఏ అధికారి లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. అప్పుడు కేవలం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది.

లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరముందని సీఎం అన్నారు.CM Revanth conducted a review on Dharani issues

భూముల రికార్డులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం కమిటీ సభ్యులను అప్రమత్తం చేశారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అప్పటివరకు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులుండగా.. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

Updated : 24 Feb 2024 1:21 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top