Home > తెలంగాణ > Revanth Reddy : రాష్ట్ర ఆదాయ సేకరణపై సీఎం రేవంత్ రివ్యూ

Revanth Reddy : రాష్ట్ర ఆదాయ సేకరణపై సీఎం రేవంత్ రివ్యూ

Revanth Reddy : రాష్ట్ర ఆదాయ సేకరణపై సీఎం రేవంత్ రివ్యూ
X

అదనపు ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆర్థికశాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సోమవారం సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, గనులు, గృహ నిర్మాణం, హెచ్‌ఎండీఏ, టీఎస్ఎమ్ డీసీ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా పెండింగ్‌ బకాయిలపై చర్చించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటి వరకు విక్రయించిన భూములు, వచ్చిన ఆదాయం, పెండింగ్‌ బకాయిల మీద సమగ్ర సమీక్ష చేశారు. అలాగే లిక్కర్ కు సంబంధించి బెల్ట్ షాపుల ఏరివేతపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. ఆర్థిక శాఖ సమన్వయంతో ముందుకెళ్లెలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని డిస్టీలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. పూర్తిస్థాయి ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కాగా ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల హామీల అమలు చాలా ఇబ్బందిగా మారింది. రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో రేవంత్ సర్కార్ నిధుల సమీకరణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లి పీఎం మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్ర వాటా కింద రావాల్సిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరు భావించే లిక్కర్ పై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపుల ఏరివేతకు సిద్ధమవుతోంది. బెల్ట్ షాపులను నివారించడం ద్వారా లిక్కర్ మాఫియాకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. అదే జరిగితే రాష్ట్ర ఆదాయం కొంతనైనా పెరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated : 26 Feb 2024 4:13 PM IST
Tags:    
Next Story
Share it
Top