Home > తెలంగాణ > ఎయిమ్స్ లో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రావాలి.. సీఎం రేవంత్

ఎయిమ్స్ లో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రావాలి.. సీఎం రేవంత్

ఎయిమ్స్ లో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రావాలి.. సీఎం రేవంత్
X

బీబీనగర్ లోని ఎయిమ్స్ లో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ లో పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకు వస్తే చాలా మందికి మేలు జరుగుతుందని అన్నారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపైనా భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎయిమ్స్ ను సందర్శించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని వెల్లడించారు.

తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండాలని అన్నారు. కొడంగల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆరోగ్యశ్రీ అమలుపై కూడా నివేదిక తయారు చేసి అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పేద ప్రజలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు వస్తారని, వాళ్లకు నాణ్యమైన వైద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం అదేశించారు.

Updated : 29 Jan 2024 12:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top