Home > తెలంగాణ > Revanth Reddy : ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ చేపట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Revanth Reddy : ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ చేపట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Revanth Reddy : ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ చేపట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
X

అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి

ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది.. ఏయే సంస్థలున్నాయి.. బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలీకి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్ లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు.

టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏండ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్ బీ కంపెనీకి ఎలా అప్పగించారని సీఎం ఆరా తీశారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్ ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అవుటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని సీఎం సూచించారు.

హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించాలని, మరోవైపు ల్యాండ్ పూలింగ్ ను వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. అవసరమైతే ల్యాండ్ పూలింగ్, అక్కడి స్థలాల అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉన్నాయని, వీటిలో 2031 పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని అధికారులు తెలపగా.. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రకటనల ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సమావేశంలో చర్చ జరిగింది. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.

Updated : 28 Feb 2024 3:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top