కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ భేటీ
X
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కార్యాలయానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. రూ.4,256 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కోరారు. హైదరాబాద్, విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ మంజూరు చేసిందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన చేశారని.. సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నేషనల్ డిజైన్ సెంటర్‌ను విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త ఎన్ఐడీ మంజూరు చేయాలని కోరారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ సమావేశంలో పాల్గొనడానికి నిన్న ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై ఆయనతో చర్చించారు.