Home > తెలంగాణ > 'ప్రజా పాలన'పై సీఎం సందేశం ఇదే..!

'ప్రజా పాలన'పై సీఎం సందేశం ఇదే..!

ప్రజా పాలనపై సీఎం సందేశం ఇదే..!
X

రేపటి (డిసెంబర్ 28) నుంచి రాష్ట్రంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన లోగో, పోస్టర్, అప్లికేషన్ ఫామ్ లను రిలీజ్ చేశారు. కాగా ప్రజా పాలన కార్యక్రమంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చినట్లు 6 గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలు అందులో చెప్పారు.

లేఖలోని సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సందేశం ఇదే..

అందరికీ నమస్కారం

ప్రజా పాలనను కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

మాట ఇచ్చినట్టుగానే, ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్వారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటలోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైనవారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్వారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి.. మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము.

చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశ్యం నిస్సహాయులకు సాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమయజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాము.

కృతజ్ఞతలతో

మీ రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్రం


Updated : 27 Dec 2023 10:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top