సీఎం రేవంత్ నోట అందెశ్రీ పాట
X
అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రముఖ కవి అందెశ్రీ పాటతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. " ఏందిరా ఏందిరా తెలంగాణం.. ఎలా మూగబోయింది జనగానం.. ఏందిరా ఏందిరా తెలంగాణం..యముల పాలవుతోంది మాగాణం.. రాష్ట్రమొస్తే కుక్కలా కాపలా ఉంటనంటివి.. మక్కువతో పలికిన మాటలేమాయె?.. అధికారమొచ్చి అహంకారంతో పొంకనాలకు పోయి రంకెలేసుడేందీ?" అంటూ అందెశ్రీ కవిత్వంతో సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. అయితే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఆ పార్టీ గౌవరం ఇవ్వలేదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష పార్టీ నేత అవకాశం వేరే వాళ్లకు ఇస్తారని ఆశించానని, కానీ అలా జరగలేదని అన్నారు. ప్రజలు ఛీ కొట్టిన బీఆర్ఎస్ నేతలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రగతి భవన్ గోడలను బద్దలు కొట్టామని, ఆదర్శవంతమైన పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు.