తాగు నీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం.. సీఎం రేవంత్
X
వేసవి కాలంలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగు నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు.
తొలుత రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు, తాగు నీటికి అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు గణాంకాలు వివరించారు. అనంతరం సీఎం రేవంత్ స్పందిస్తూ.. నగరాలు/పట్టణాలు, పల్లెలు,తండాలు, గూడేలు, ఎస్సీ కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగు నీరు అందేలా సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా శాఖల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీలకుపైగా నీరు తీసుకుపోతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నారని, సరైన గణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీటికి నీరు తీసుకోవాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంత నీరు అవసరమో సమగ్రంగా సమీక్షించి వెంటనే కేఆర్ ఎంబీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో ఏప్రిల్ నెలాఖరు, మే నెలలో వచ్చిన వర్షాలతో జూరాలకు నీరు రావడంతో ఇబ్బంది రాలేదని, లేకుంటే నారాయణపూర్ జలాశయం నీరు విడుదల కోరుతూ కర్ణాటకను అభ్యర్థించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా మూడేళ్ల క్రితం తీసుకున్నామని తెలిపారు. అయితే దానిని చివరి అవకాశంగా తీసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సూచించారు. నూతన పథకాలు వచ్చిన తర్వాత గతంలో ఉన్న అనేక నీటి వనరులను వదిలేశారని, ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా కాగ్నా నదిని సీఎం ఉదాహారించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీరు వినియోగించుకునే అవకాశం ఉందని, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దానిని వదిలేశారని, అటువంటివి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉంటాయని వాటిని వినియోగించుకోవాలన్నారు. అలాగే అవసరమైన చోట తాగు నీటి బోర్లు, బావులు, మోటార్లకు మరమ్మతులు చేయించాలని, ఇందుకు ఎమ్మెల్యేలకు కేటాయించిన ఏసీడీపీ నిధుల నుంచి రూ.కోటి, అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. తాను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగు నీటి సరఫరా లేదని, మిషన్ భగీరథ ద్వారా 99 శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చినందునే జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి నిధులు రావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదికలు కేంద్రానికి పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
జులై నెలాఖరు వరకు ఎక్కడ తాగు నీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు ఆయా జిల్లాల్లో ఉన్న నీటి వనరులు, అవసరమైన తాగు నీటి పరిమాణం, సమస్యలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదనే వార్తలు వస్తున్నాయని అన్నారు. గత రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. వేతన బకాయిలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి సిబ్బందికి వేతనాలు అందేలా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. తాము నిధులు విడుదల చేస్తామని వాటిని బడా బాబులకు ఇవ్వకుండా క్షేత్ర స్థాయి సిబ్బందికి అందేలా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనూ తాగు నీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెద్దగా ఇబ్బందులు లేవని, ఏదైనా కొరత ఏర్పడితే ఎల్లంపల్లి, నాగార్జున సాగర్ నుంచి కొంతమేర తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నగరంలోని నీటి అవసరాలపై సూక్ష్మ స్థాయి (మైక్రోలెవల్)లో సమీక్షించి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి కొంత ఇబ్బంది ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేసవి పూర్తయ్యే వరకు తాగు నీటి ట్యాంకర్ల రాకపోకల విషయంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.