ఆ నియామకం పూర్తయ్యాకే టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ - సీఎం రేవంత్
X
చైర్మన్ నియామకం తర్వాతే టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు వెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సెక్రటేరియట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజ పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను సీఎం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా పత్రాన్ని గవర్నర్ అందజేశారని, అయితే ఆయన రాజీనామా ఇంకా పెండింగ్ లో ఉన్నదని తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. చైర్మన్, సభ్యులు లేకుండా నియామకాలు చేపట్టడం చట్ట పరంగా కుదరదని అన్నారు. ఇక జనవరిలో జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రివ్యూ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 2024 డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం కాగానే ఉద్యోగాల భర్తీని కొనసాగిస్తామని తెలిపారు.