ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం!
X
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు కార్యక్రమాలను ప్రారంభించిన రేవంత్ సర్కార్.. ఈ నెల 28 నుంచి మరికొన్ని హామీలను నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీల హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉండగా.. పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉన్నారు. కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50 వేల రూపాయల చొప్పున 70 వేల స్కూటీలకు రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక స్కీమ్ అమలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం.